Tags

, , , , , , , , , , , , , ,

భవిష్యత్తులో సూపర్‌పవర్‌గా ఎదిగేందుకు అవకాశమున్న అతికొద్ది అభివృద్ధి చెందుతున్న దేశాలలో మన దేశం కూడా ఒకటి. కానీ ఇప్పటికీ మనకు నిరుద్యోగరేటు, జననాల రేటు, ఆదాయాలలో అంతరాలు, వాస్తవ పేదరికం స్థాయి ఏంటో తెలియదు. ప్రభుత్వం చూపిస్తున్న కాకిలెక్కలే ఇందుకు నిదర్శనం. ఇదే ప్రభుత్వం వివిధ కమిషన్ల ద్వారా పేదరికంపై నివేదికలు ఇస్తే అన్నీ వేర్వేరుగా ఉంటాయి! అంతేకాదు వివిధ సంస్థలు చూపించే నిరుద్యోగం లెక్కల్లోనూ బోలెడంత వ్యత్యాసం. అదేదో వేర్వేరు దేశాలకు చెందినదని అనుకుంటారే తప్ప ఒకే దేశానిదని నమ్మరు. మన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలు మరింత ఎత్తుకు ఎదిగాయి. ముందుగా వాటిని ఒకచోట చేర్చిఈ సమాచారాన్ని విశ్లేషించడానికి చాలా సమయం పడుతుంది. తర్వాత వాటి కచ్చితత్వం, విశ్వసనీయత మాత్రం ఎప్పుడూ అనుమానమే. ఇక జనాభా లెక్కలు చూస్తే.. ఇవి మహా దారుణం. ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ ప్రతియేటా తమ జనాభా లెక్కలను చూసుకుంటూ ఎప్పటికప్పుడు తమ దేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటుంటే మన జనాభా లెక్కలు మాత్రం పదేళ్లకోసారి తీస్తారు!

ఇక మన సామాజిక సూచికల పరిస్థితి, వాటి అశాస్త్రీయ వినియోగాన్ని బట్టి ప్రస్తుత ప్రభుత్వం 2009లో దేశవ్యాప్తంగా యూఐడీఏఐ ప్రాజెక్టు అమలును ప్రకటించింది. మన దేశ పౌరులందరికీ ప్రత్యేకంగా ఒక విశిష్టమైన గుర్తింపు సంఖ్యను అందించే లక్ష్యంతో ఇది మొదలుపెట్టింది. దీనివల్ల భవిష్యత్తులో ప్రతి ఒక్క పౌరుడి బయోమెట్రిక్ సమాచారం అంతా ఒక కేంద్రీకృత సెర్వర్‌లో ఉంటుంది.

ఇక మరోవైపు.. అమెరికాలో సోషల్ సెక్యూరిటీ కార్డు అనేది ఒకటుంది. అది అక్కడి సోషల్ సెక్యూరిటీ చట్టంలోని 205(సి)92) ప్రకారం అమలవుతోంది. ఈ సోషల్ సెక్యూరిటీ నెంబరును గుర్తింపు దగ్గర నుంచి సమాచార సేకరణ వరకు ప్రతి విషయంలోనూ ఉపయోగిస్తారు. అలాగే ఇంగ్లండ్‌లో జాతీయ బీమా నెంబరు ఉంది. అది ఉద్యోగకల్పన, బీమాలతోపాటు గుర్తింపుపన్ను చెల్లింపు ఇతర కార్యక్రమాలకూ ఉపయోగపడుతుంది. ఇవన్నీ గుర్తింపునకే ఉపయోగపడతాయి. జీవితంలో చదువు నుంచి పెళ్లి వరకు ప్రతి కీలక పత్రాలకూ ఇవే ఆధారం అవుతాయి. కాబట్టి ఈ కార్డులు వన్‌స్టాప్ సమాచార స్రవంతిలా ఉంటాయి. వాస్తవానికి చిలీలో అయితే రన్ అనే జాతీయ గుర్తింపు సంఖ్యను దాదాపు అన్ని అవసరాలకూ ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొత్తగా పుట్టిన పిల్లాడికి కూడా చిలీలో రన్ ఇస్తారు. అలాగే డెన్మార్క్‌లో తన సొంత సీపీఆర్ ఉంది. చైనాలో యూనిక్ ఐడీ కార్డులు 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఇస్తారు. దీనివల్ల ఒక్కోసారి ఒక్కో పత్రం సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది. అదే మనదేశంలో మాత్రం అలా కానేకాదు. ఇక్కడ ప్రతిసారీ ఎదుగుతున్న కొద్దీ ప్రతి పత్రాన్నీ జాగ్రత్తగా దాచుకోవాలి. జనన ధ్రువీకరణ పత్రం నుంచి ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్‌కార్డు, పెళ్లి సర్టిఫికెట్, రేషన్‌కార్డు చివరకు మరణ ధ్రువీకరణ వరకు బోలెడన్ని ఉంటాయి.

అయితే.. ఈ కార్డులన్నింటి వెనక ఉన్న ఏకైక లక్ష్యం.. ఆరోగ్యం నుంచి ఉద్యోగ కల్పన వరకు వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు సమర్ధంగా ఉండేలా చూసుకోవడమే. వంద కోట్లకు పైగా జనాభా (ప్రతి స్థాయిలో 80 శాతానికి పైగా అవినీతిపరులైన అధికారులు ఉన్నదేశం) ఉన్న దేశంలో బయో మెట్రిక్ కార్డులు ఒకరకంగా తప్పనిసరనే చెప్పుకోక తప్పదు. యూఐడీఏ కార్డులు చాలావరకు నిధుల అసమాన పంపిణీని కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ సమాచారాన్ని ఆ తర్వాత కూడా స్టాటస్టికల్ మోడలింగ్‌కు.. జననాలు, మరణాల రేటు, సంతానసాఫల్యం, ఉద్యోగకల్పన, విద్య ఇలాంటి లెక్కల అంచనాకు ఉపయోగిస్తారు. 

కానీ ఈ ప్రాజెక్టు మాత్రం గత డిసెంబర్‌లో అది మొదలైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. యూఐడీఏఐ ప్రాజెక్టుపై పార్లమెంటరీ స్థాయీసంఘం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ‘నేషనల్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిల్లు 2010కి ఈ కమిటీ తన నిరాకరణను స్పష్టంగా తెలియజేస్తోంది. అందువల్ల ఈ కమిటీ యూఐడీ పథకాన్ని పునస్సమీక్షించాల్సిందిగా ప్రభుత్వానికి సూచిస్తోంది…’ అని తెలిపింది. పైపెచ్చుప్రస్తుత రూపంలో చూస్తే.. అది యూపీఏ ప్రభుత్వం చేపట్టిన ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల్లాగే ఒక రాజకీయ కార్యక్రమంలాగే ఉంది. సమీప భవిష్యత్తులోనే దాన్ని నిషేధించవచ్చులేదా వేరే ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే దీన్ని అక్కడికక్కడే ఆపేయొచ్చు. అలాంటి పరిస్థితిలో ఇలాంటి తెలివైన ప్రాజెక్టుదాని భవిష్యత్తు అంతా అంధకారమే అవుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పటికైనా దీన్ని తన పరిధిలోకి తీసుకునిఅసలు ఈ మొత్తం ప్రాజెక్టు అమలు ఎంతవరకు సాధ్యమన్న విషయాన్ని తేల్చేందుకు ఒక స్వతంత్ర కమిటీని నియమించాలి. సూక్ష్మంగా చెప్పాలంటే ఈ కార్డును ప్రతి ఒక్క పౌరుడి రాజ్యాంగ హక్కుగా రూపొందించాలి! అప్పుడైనా ప్రతి ప్రభుత్వానికీ వాస్తవిక పారదర్శక నివేదికలు అందుతాయి!

Advertisements